కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది.
అయితే కేరళ ప్రభుత్వానికి ఏపీ సాయం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కేరళ వరదల సమయంలో ఇలాగే వ్యవహరించింది. 2018లో కేరళలో వరదలు విలయం సృష్టించాయి. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అప్పట్లో కూడా ప్రభుత్వం తరుఫున కేరళగా సాయం చేశారు. అలాగే ఏపీలోని గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లు కలిసి కేరళ వరద బాధితుల సహాయం కోసం రూ.20 కోట్లు విరాళంగా అందించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటుగా, ఉపాధ్యాయులు, పింఛనర్లు అందరూ విరాళాలు వేసుకుని ఈ రూ.20 కోట్లను కేరళ ప్రభుత్వానికి అందజేశారు. ఐఏఎస్ అధికారుల సమాఖ్య కూడా అప్పట్లో ఒక రోజు జీతాన్ని విరాళంగా అందించింది.
మరోవైపు ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం వయనాడ్ బాధితుల కోసం విరాళాలు ప్రకటించారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వయనాడ్‌కు అండగా నిలిచి తమ పెద్దమనుసు చాటుకున్నారు. తెలుగు వారి విషయానికి వస్తే హీరో ప్రభాస్ రెండు కోట్లు విరాళంగా అందించగా.. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ చెరో కోటి రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు. అంతేకాదు చిరంజీవి స్వయంగా వెళ్లి కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ను కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, హీరోయిన్ రష్మిక రూ.10 లక్షలు సహా మరెంతో మంది ప్రముఖులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని విరాళంగా అందించారు. మరికొంత మంది తారలు కేరళ ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తమ విరాళం అందించారు.