ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది.. విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. వచ్చే నెల 14 నుంచి ఈ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎప్పటి నుంచో విజయవాడ నుంచి ఉదయం సమయంలో ఢిల్లీకి విమాన సర్వీసు అందుబాటులోకి తేవాలని ప్రయాణికుల నుంచి రిక్వెస్ట్ ఉంది. ఈ మేరకు కొత్త సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
ఈ విమానం విజయవాడలో ఉదయం 11.10 గంటలకు విమానం బయలుదేరి.. మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. అలాగే ఢిల్లీ నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరి.. విజయవాడకు 10.40 గంటలకు వస్తుంది. ఈ కొత్త విమాన సర్వీస్ అందుబాటులోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, దేశ రాజధాని ఢిల్లీ మధ్య రాకపోకలు సులభతరం అవుతాయన్నారు రామ్మోహన్ నాయుడు.
ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించాలని వినతిపత్రం అందజేశారు. విజయవాడ నుంచి అహ్మదాబాద్, విజయవాడ నుంచి పుణె, విజయవాడ నుంచి వారణాసి వయా విశాఖపట్నం, విజయవాడ నుంచి కోల్‌కతా వయా విశాఖపట్నం, విజయవాడ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి విమాన సర్వీసుల ప్రారంభించాలని రిక్వెస్ట్ చేశారు. ఇండిగో సంస్థ సర్వే చేసిన ఈ మార్గాల్లో విమాన సర్వీసులు ప్రారంభించేలా చూడాలని కోరారు. అయితే ప్రస్తువానికి విజయవడ నుంచి ఢిల్లీకి కొత్త సర్వీస్ ప్రారంభంకానుంది. అంతేకాదు త్వరలోనే విజయవాడ నుంచి మరికొన్ని విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు ఏపీలో శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం, నాగార్జునసాగర్ దగ్గర విమానాశ్రయాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని.. పనుల్లో పురోగతిని ప్రతి నెలా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు రామ్మోహన్. గత నెల నుంచి ఇప్పటి వరకు 4 శాతం పురోగతి ఉందని.. ఎయిర్‌పోర్టు పనుల్లో ఇప్పటి వరకు 36 శాతం పూర్తయ్యాయి అన్నారు. విమానాశ్రయం నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తామని.. ఎల్‌అండ్‌టీ సంస్థలు వేగంగా పూర్తి చేస్తున్నాయన్నారు కేంద్రమంత్రి. పనులు అనుకున్న సమయం కంటే వేగంగా జరుగుతున్నాయని.. తాము అనుకున్న సమయం కంటే ముందే ఈ పనులు పూర్తి చేసి.. విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధీమాను వ్యక్తం చేశారు.