తుంగభద్ర జలాశయం నీటిని కాపాడేందుకు చేపట్టిన స్టాప్‌లాగ్ గేట్ ఏర్పాటు దేశ చరిత్రలో అద్భుత ఘట్టంగా నిలిచిపోతుందని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొన్నారు. దాదాపు 11 అడుగులు వేగంగా ప్రవహరించే వరద నీటి ఉద్ధృతి, ఒత్తిడిని అధిగమించి స్టాప్‌లాగ్ అమర్చడం ఓ రికార్డు అని తెలిపారు. ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు నిపుణులను, సిబ్బందిని అభినందించారు. జలాశయం వద్ద మరో రెండు ఎలిమెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన రెండు శనివారం ఉదయానికి ప్రాజెక్టుకు చేరుకుంటాయి. వాటిని ఒకదాని మీద ఒకటి ఏర్పాటు చేస్తూ రావాలి. అప్పుడు... 60 అడుగుల వెడల్పు... 20 అడుగుల ఎత్తుతో ‘స్టాప్‌లాగ్’ను పూర్తిగా అమర్చినట్లవుతుంది. శనివారం రాత్రికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇది విజయవంతంగా పూర్తయితే... ఇప్పటికిప్పుడు 25 టీఎంసీల నీటిని కాపాడుకున్నట్లవుతుంది. ఈ సీజన్‌లో మున్ముందు వచ్చే వరద జలాలనూ పట్టి నిలిపినట్లే!