గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపేందుకు త్వరలోనే ఓ ప్రత్యేక కమిటీని నియమించనున్నామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. శుక్రవారం ఆయన మంగళగిరి, తాడేపల్లిల్లో అన్నక్యాంటీన్‌లను ప్రారంభించారు. పేదలతో కలిసి భోజనం రుచి చూశారు. అనంతరం మంగళగిరి అన్నక్యాంటీన్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘అడ్డగోలుగా ప్రజాసంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకుండా ఎలా ఉండమంటారు? మింగేసిన ప్రజాధనాన్ని కక్కించడం మా బాధ్యత తప్ప, కక్ష సాధింపు కాదు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమిస్తాం. అంబేడ్కర్ స్మృతివనంలో అంబేడ్కర్ పేరుకన్నా తన పేరునే పెద్దదిగా పెట్టుకోవడంతో కొందరు దళిత యువకులు బాధచెంది జగన్ పేరును పీకేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విదేశీవిద్యకు అంబేడ్కర్ పేరు పెడితే, జగన్ వచ్చి ఏమాత్రం బిడియపడకుండా అంబేడ్కర్ పేరును తొలగించేసి తన పేరు పెట్టుకున్నారు. ముందు దీనికి ఆయన సమాధానం చెప్పి తీరాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.