తూర్పు గోదావరి జిల్లా బిక్కవోరు మండలం పందలపాకలో 8 మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని శ్రీధర్, నారాయణరెడ్డికి చెందిన 15 ఎకరాల్లో గుళికల మందు చల్లేందుకు 10 మంది రైతు కూలీలు పొలంలోకి వెళ్లారు. మందు చల్లిన తరువాత మజ్జిగ తాగి మళ్లీ పనిలోకి ఉపక్రమించారు. కొద్దిసేపటికే 8 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు.భూ యజమాని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సకాలంలో అక్కడికి చేరుకుని అంబులెన్స్ కూలీలను అనపర్తి ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేసింది. విషయం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ అస్వస్థతకు గురైన రైతు కూలీలను సకాలంలో ఆసుపత్రికి తీసుకు రావడం వల్ల సరైన వైద్యం అందించామని, ప్రస్తుతం కూలీలంతా కోలుకుంటున్నారని తెలిపారు.