ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయినా ఇంకా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతున్నాయి.. తాజాగా, పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల చేసిన బదిలీల్లో ప్రభుత్వం మార్పులు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు వెలువరించారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎన్.తేజ్ భరత్, పాడేరు ఐటీడీఏ పీడీ అభిషేక్‌ను చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా.. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్‌ను పాడేరు సబ్ కలెక్టర్‌గా నియమించింది. ఆయనకు పాడేరు ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలను అప్పగించింది.
మార్కాపురం సబ్-కలెక్టర్ రాహుల్ మీనాను కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా... ఆదోని సబ్-కలెక్టర్ శివ నారాయణ శర్మను.. అనంతపురం జిల్లా జేసీగా నియమించింది. వారం రోజుల కిందట జరిగిన బదిలీల్లో అనంతపురం జిల్లా జేసీగా డి. హరితను నియమించగా.. ఆమె స్థానంలో శర్మ నియమాకం జరిగింది. కందుకూరు సబ్-కలెక్టర్ విద్యాధరిని కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
అలాగే, కొవ్వూరు సబ్-కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం.. ఆయనకు ఐటీడీఏ పీవోగానూ అదనపు బాధ్యతల్ని అప్పగించింది. పెనుకొండ సబ్-కలెక్టర్ అపూర్వ భరత్‌ను ఏటిపాక సబ్ కలెక్టర్‌గా.. చిత్తూరు ఐటీడీఏ పీవోగా పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఐపీఎస్‌ల బదిలీలు జరిగిన 24 గంటల్లోనే ఈ బదిలీలు జరగడం గమనార్హం. శుక్రవారం 10 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన 16 మంది ఐపీఎస్ అధికారులకు ఎటువంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా హోల్డింగ్‌లో పెట్టింది. ఈ అంశంపై రాజకీయ వివాదం నెలకుంది. జీపీ, అదనపు డీజీపీ, ఇన్‌స్పెక్టర్ జనరల్, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులైన పీ సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్, ఎన్ సంజయ్, కాంతి రాణా టాటా, జీ పాలరాజు, కొల్లి రఘురామ్ రెడ్డి, ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, సీహెచ్ విజయారావు, విశాల్ గున్నీ, అన్బురాజన్, వై రవిశంకర్ రెడ్డి, వై రిషాంత్ రెడ్డి, కే రఘువీరా రెడ్డి, పీ పరమేశ్వర్ రెడ్డి, పీ జాషువా, కృష్ణకాంత్ పటేల్ తదితరులు ఉన్నారు. వీళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రజల కోసం కాకుండా.. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపణలు. ప్రభుత్వం మారిన తర్వాత వీరు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.