గాయాలతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి చికిత్స చేస్తున్న మహిళా డాక్టర్‌పై దాడి జరిగింది. పేషెంట్, అతని స్నేహితులు డాక్టర్‌పై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పేషెంట్ తో సహా అందరూ మద్యం మత్తులో ఉన్నారని, డాక్టర్‌ను తిడుతూ గొడవ చేశారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. కోల్ కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటన నేపథ్యంలో డాక్టర్లకు రక్షణ కరువైందని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముంబైలోని సియోన్ ఆసుపత్రికి ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ముఖంపై గాయాలతో రక్తమోడుతూ వచ్చాడు. ఆయనతో ఐదారుగురు వ్యక్తులు తోడుగా వచ్చారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. వార్డులో విధులు నిర్వర్తిస్తున్న రెసిడెంట్ డాక్టర్ ఈ పేషెంట్ ను అటెండ్ అయ్యారు. గాయాలకు చికిత్స చేస్తుండగా పేషెంట్ తిట్లదండకం మొదలు పెట్టాడు. ఆపై మహిళా వైద్యురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలికి గాయాలయ్యాయి. వైద్యురాలి కేకలతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధిత డాక్టర్ సియోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.