శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలానికి చేందిన ఓ పత్రిక విలేకరి గురిజా దామోదరరావు మృతి కేసులో ఎలాంటి పురోగతి లేదని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అండ్ స్టేట్ సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతినాయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది నెలల కిందట దామోదరావు ఆత్మహత్య చేసుకున్నాడని, తన చావుకు అప్పటి ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, లంకలపల్లి గోపి కారణమని ఆయన సూసైడ్ నోట్ రాసినప్పటికీ ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదని తెలిపారు. రాజకీయ జోక్యంతో ఆ కేసును మూలపడేశారని ఆరోపించారు. దీనిపై గత నెల 3న విజయవాడ మంగళగిరిలో డీజీపీ ద్వారకా తిరుమలరావుకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తక్షణం కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తాము పోరాటం సాగిస్తామని తెలిపారు.