రాయదుర్గం నియోజకవర్గంలో ఆలయాలను టార్గెట్ చేస్తూ గుప్తనిధుల వేటకు పాల్పడుతున్న ఒక ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవిబాబు తెలిపారు. పట్టణంలోని పోలీస్‌స్టేషనలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం పట్టణ సమీపంలోని కుంటుమారమ్మ ఆలయం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రాయదుర్గం వైపు నుంచి వస్తున్న కేఏ 7097 నంబర్ గల కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించి వెంబడించామన్నారు. అయితే ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారయ్యారన్నారు. కారులో గ్యాస్ కట్టర్, సిలెండర్, గుణపాలు, సుత్తిలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గుప్తనిధుల కోసం కర్ణాటక రాష్ట్రం అఽశోక సిద్ధాపురం వైపు పోతుండగా పట్టుకున్నామన్నారు. శింగనమలకు చెందిన విజయకుమార్, పెద్దవడుగూరు మండలం మిడుతూరుకు చెందిన శివశంకర్, బోయ వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. అదే విధంగా ఈ గ్యాంగ్‌కు సంబంధించిన పట్టణానికి చెందిన వన్నూరువలి, నబీఖానను స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద ఇదివరకే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.