వైసీపీ నాయకులు అవమానకరమైన మీమ్ తనపై ప్రదర్శించి తనను అవమానించి మానసిక వేదనకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య స్థానిక పోలీసులను కోరారు. ఆమె తన ఫిర్యాదును తన సోదరుడి ద్వారా నందిగామ స్టేషన్‌లో అందజేశారు. ఈ ఏడాది జనవరి నెలలో జగనన్న వాక్‌వే ప్రారంభం సందర్భంగా పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు షేక్ కరీముల్లా(దుబాయ్), ఆయన కుమారుడు షేక్ సాహిలు తనపై అవమానకర మీమ్స్ ప్రదర్శించారని ఆరోపించారు. పెద్దఎత్తున ప్రజలు, మంత్రులు, శాసన సభ్యుల సమక్షంలో తనను పిచ్చిదానిగా అభివర్ణిస్తూ మీమ్స్‌ను పెద్ద స్ర్కీన్‌లపై ప్రదర్శించారని పేర్కొన్నారు. సదరు మీమ్స్‌ను తప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్‌ల నుంచి ప్రసారం చేసి తనను అవమానించారని పేర్కొన్నారు. దళిత మహిళనైన తనపట్ల అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెట్టి వేధించారని తెలిపారు. సదరు మీమ్స్ వల్ల తీవ్ర మనోవేదన చెందానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరిగి మరలా వారం రోజుల నుంచి అదే మీమ్స్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేస్తూ తనను, తన సోదరిని అవమానిస్తున్నారని తెలిపారు. తాము మానసిక క్షోభను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మనస్థాపం చెందిన తన సోదరుడు వారిని నిలదీయగా, కులం పేరుతో దూషిస్తూ అవమానించినట్టు చెప్పారు. దళిత కుటుంబానికి చెందిన మా పట్ల కరీముల్లా, అతని కుమారుడు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. వారిపైనా, వారికి సహకరిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున ఫిర్యాదును సోదరుడు తంగిరాల శ్రావణ్ ద్వారా పంపుతున్నట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కరీముల్లా, అతని కుమారుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ లచ్చునాయుడు తెలిపారు.