ఒకేచోట పనిచేయడంతో వారి మధ్య స్నేహబంధం ఏర్పడింది. మందు, విందు చేసుకునే స్థాయికి వెళ్లింది. ఆ మద్యం మత్తులో చేసిన చేష్టలు ఇద్దరిని నీట ముంచేశాయి. విజయవాడ రూరల్ మండలం పాతపాడు గ్రామంలోని చేపల చెరువులో పడి గురువారం రాత్రి ఒకరు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. రాజీవ్‌నగర్‌కు చెందిన పెరుగు నాగార్జున, పెరుగు నవీన్, షేక్ లాల్‌బాషా, పిల్లి శివరాజు (23), రాణిగారితోటకు చెందిన రవికుమార్ (21) నగరంలోని ఓ ఎలకా్ట్రనిక్స్ షోరూంలో పనిచేస్తున్నారు. ఈ ఐదుగురు కలిసి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయవాడ రూరల్ మండలం కండ్రికలో మందు పార్టీ చేసుకున్నారు. అక్కడి నుంచి పాతపాడు-మంగళాపురం గ్రామాల మధ్యలో ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వాచ్‌మెన్ పౌల్‌తో కలిసి మళ్లీ మద్యం తాగారు. తర్వాత చికెన్ వండుకుని తిన్నారు. ఐదారు ఎకరాల్లో ఉండే ఈ చెరువులో ఓ ప్రైవేట్ వ్యక్తి క్యాట్ ఫిష్‌ను పెంచుతున్నాడు. వాటికి మేత వేయడానికి చిన్న ఇనుప పడవ చెరువు గట్టు వద్ద ఉంచారు. మద్యం మత్తులో ఉన్న ఈ ఐదుగురు యువకులు పడవలో చెరువు మధ్యకు వెళ్లి సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. పడవ ఎక్కి కొంతదూరం వెళ్లేసరికి అటూఇటూ ఊగడంతో అంతా ఒకవైపునకు వచ్చారు. దీంతో పడవ బోల్తా పడింది. నాగార్జున, నవీన్, లాల్‌బాషా ఈదుకుని ఒడ్డుకు చేరుకున్నారు. శివరాజు, రవికుమార్ మాత్రం నీళ్లలో మునిగిపోయారు. కొంతసేపటికి రవికుమార్ మృతదేహం కనిపించింది. శివరాజు ఆచూకీ మాత్రం లభించలేదు. సమాచారం తెలిసిన వెంటనే నున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. డీసీపీ హరికృష్ణ, ఏసీపీ రాజారావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చీకటి పడిపోవడంతో గాలింపు చర్యలకు అంతరాయం కలిగింది.