ఏలూరు నగరంలో డెంగీ కేసులు నమోదైన గవరవరం, చొదిమెళ్ళ ప్రాంతాలను వైద్యఆరోగ్యశాఖ మలేరియా విభాగం జోన్–2 అసిస్టెంట్ డైరెక్టర్ బి.లక్ష్మీనరసింహకుమార్ గురువారం సందర్శించారు. వీధులు, ఇళ్ల ఆవరణలో నీటి తొట్లను, దోమలవ్యాప్తికి దారితీసే పరిస్థితు లపై ఆరా తీశారు. ఈ రెండు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలకు డెంగీ జ్వరాలు సోకినందున పరిసర ప్రాంతాల్లో సర్వే, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం వైరల్ జ్వరాలు విజృంభించే అవకాశం ఉందని, అంటువ్యాధుల నిర్మూలనకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వర బాధితులతో ముఖాముఖీ మాట్లాడారు. జిల్లా మలేరియా అధికారి ప్రసాద్, అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు, జోనల్ టీం సభ్యులు రవిశేఖర్, సతీష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.