సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు, పెనమలూరు సీఐ వెంకటరమణ సూచించారు. గురువారం పెనమలూరు పోలీసు స్టేషన్‌లో సైబర్‌నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సెల్‌ఫోన్లకు వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దని, బ్యాంకు అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్‌వర్డును పెట్టుకుంటూ, ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలని వారు సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చెయ్యొద్దని, పబ్లిక్ ప్రదేశాల్లో వైఫై ఉపయోగిస్తూ బ్యాంక్ లావాదేవీలు చెయ్యొద్దని వివరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఉంచొద్దని, ఫేక్ లాటరీలు, ఫేక్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్‌లను నమ్మొద్దని హితవు పలికారు. ఇంటివద్దనే ఉండి డబ్బులు పెట్టుబడిగా పెడితే అధిక లాభాలొస్తాయని ఎవరైనా చెబితే నమ్మొద్దని, ఇలాంటి మోసాలకు గురైన వ్యక్తులు 1930హెల్ప్‌లైన్‌కు, సైబర్‌మిత్ర9121211100నెంబరుకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. ఇంట్లో నగదు, బంగారం లాంటి విలువైన వస్తువులు పెట్టి తాళం కనిపించేట్లు వేసి ఊర్లకు వెళ్లకూడదని, పోలీసు స్టేషనులో చెప్పి ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టంను అమర్చుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.