ఫిబ్రవరి 6వ తేదీ నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని ఇప్పటికే యడ్యూరప్ప నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగానే అవిశ్వాసం పెట్టి బలనిరూపణకు ఛాలెంజ్ విసిరాలన్న యోచనలో కమలం పార్టీ ఉంది. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను మరోసారి రిసార్ట్ కు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురితో కాంగ్రెస్ నేతలు బేరసారాలు కొనసాగించారన్న సమాచారం అందడందో బీజేపీ అప్రమత్తమయింది. కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీకి మధ్య పొడసూపిన విభేదాలు సయితం తమకు లాభిస్తాయని యడ్యూరప్ప భావిస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ సభ్యులు రమేష్ జార్ఖిహోళి, నాగేంద్ర, ఉమేష్ జాదవ్, మహేష్ కుమటహళ్లి లు కాంగ్రెస్ కు దూరంగా ఉంటూనే ఉన్నారు. వీరంతా కూడా రిసార్ట్ కు వెళ్లాలా? నేరుగా అవిశ్వాసం సమయంలో సభలో అడుగుపెట్టాలా? అన్న యోచనలో ఉన్నారు. వీరితో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వీరందరి చేత ముందుగా రాజీనామాచేయించాలా? లేక అవిశ్వాసానికి ఓటు వేసిన తర్వాత రాజీనామా చేయించాలా? అన్న సంగతిపై న్యాయనిపుణులతో ఇప్పటికే యడ్యూరప్ప చర్చించినట్లు తెలుస్తోంది.గవర్నర్ తమ చేతిలో ఉన్నారు కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని సులువుగా తీసుకువచ్చే వీలుంది. అయితే ఇప్పటికే ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేసి ఒక్కరోజులోనే బలం నిరూపించుకోలేకపోయిన యడ్యూరప్ప మరోసారి అలాంటి అవమానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరు. అందుకోసమే అన్ని రకాలుగా వ్యూహాలను ఆయన రచిస్తున్నారు. సిద్ధరామయ్య తమ ముఖ్యమంత్రి అంటూ ఇద్దరు మంత్రులతో పాటు కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు జేడీఎస్, కాంగ్రెస్ లలో మంట రేపాయి. దీన్ని అనువుగా మలచుకోవాలనుకుంటున్నారు యడ్యూరప్ప.
తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా, కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి ఎమ్మెల్యేలను రాబట్టుకునే లక్ష్యంతో యడ్యూరప్ప ఉన్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఆరేళ్ల పాటు పోటీకి దూరంగా ఉండాల్సి వస్తోంది. అందుకోసమే ముందుగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవడం ఇప్పుడు అసమ్మతి ఎమ్మెల్యేల ముందున్న ఒక ఆప్షన్. ఉప ఎన్నికల్లోనూ తమను గెలిపించే బాధ్యతను బీజేపీయే తీసుకోవాల్సి ఉంటుందన్న షరతును కూడా అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యడ్యూరప్ప ముందుంచినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా కట్టుదిట్టంగానే తమ ఎమ్మెల్యేలను జారిపోకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల మొదటి వారంలో జరగనున్న బడ్జెట్ సమావేశాలు సంకీర్ణ ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa