సినిమా ఫక్కీలో పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవాలనుకున్న ఓ కామాంధుడైన మాజీ పోలీసు ఎత్తుగడ చివరకు బెడిసికొట్టింది. మహిళా వేషధారణలో బుర్ఖా ధరించి.. లిప్‌స్టిక్ వేసుకుని గుర్తు పట్టలేనంతగా మారిపోయినా.. రాజస్థాన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని కటకటాల్లోకి నెట్టారు. ముఖ్యంగా ఓ అమ్మాయిపై అత్యాచారం చేసిన ఈ నిందితుడిని ఎలా పట్టుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై కూడా ఓ కన్నేద్దాం.
ఉద్యోగం ఆశచూపి ఘాతుకం..
రాజస్థాన్‌లోని ధోల్పూర్కు చెందిన రాంభరోస్ అలియాస్ రాజేంద్ర సిసోడియా గతంలో రాజస్థాన్ సాయుధ కానిస్టేబులరీ (RAC)లో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. అయితే ఇతగాడు గతంలోనే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటంతో.. పోక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే అతడిని సర్వీసు నుంచి సస్పెండ్ చేశారు. అయినా ఇతడి తీరులో మార్పు రాలేదు. డిసెంబర్ 15వ తేదీన తన వక్రబుద్ధిని మళ్లీ ప్రదర్శించాడు. ముఖ్యంగా ఓ 16 ఏళ్ల యువతికి, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన ఇంటికి పిలిపించుకున్నాడు. పథకం ప్రకారం తమ్ముడిని మార్కెట్‌కు పంపి.. ఒంటరిగా ఉన్న ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధిత యువతి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. జనసందోహాన్ని గమనించిన రాజేంద్ర సిసోడియా అక్కడి నుంచి చాకచక్యంగా పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితుడు నిరంతరం తన రూపాన్ని, వేషధారణను మారుస్తూ ఆగ్రా, లక్నో, గ్వాలియర్ వంటి నగరాల్లో తలదాచుకున్నాడు. ఎక్కడా తన అసలు గుర్తింపు బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు.
నిందితుడు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బృందావన్‌లో ఉన్నట్లు రాజస్థాన్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఒక ప్రత్యేక బృందం మథురలోని బృందావన్‌కు చేరుకుంది. అక్కడ ఒక వ్యక్తి బుర్ఖా ధరించి, పెదాలకు లిప్‌స్టిక్ వేసుకుని పూర్తి స్థాయిలో మహిళా గెటప్‌లో ఉండటం పోలీసుల కంటపడింది. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. అది మరెవరో కాదు.. పరారీలో ఉన్న రాజేంద్ర సిసోడియా అని తేలింది. మహిళా వేషంలో తప్పించుకోవచ్చన్న నిందితుడి ప్లాన్ తిరగబడటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ధోల్పూర్కు తరలించారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి.. వరుసగా అరాచకాలకు పాల్పడుతున్న ఈ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ అసాధారణ అరెస్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa