విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని ఓ జంట సెల్ఫీ వీడియో వైరల్ అయ్యింది. తాము కొనుగోలు చేసిన పులిహోరలో నత్తగుల్ల వచ్చిందని ఆరోపించారు. సింహాచలంలో ప్రసాదం కొనేముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలంటూ ఆ జంట చెప్పుకొచ్చింది. అయితే సింహాచలం దేవస్థానం అధికారులు వెంటనే స్పందించారు. సెల్ఫీ వీడియో చేసి వైరల్ చేసి వ్యక్తులపై గోపాలపట్నం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.. ఉద్దేశపూర్వకంగా ఆ జంట ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు.
'సింహాచలం ఆలయంలో భక్తుడు, భక్తురాలు దర్శనం తర్వాత పులిహోర ప్రసాదం కొనుగోలు చేశారు.. అయితే ఆ ప్రసాదంలో నత్త వచ్చిందని వీడియో పోస్ట్ చేశారు. భక్తుల్ని హెచ్చరిస్తూ ప్రసాదం కొనుగోలు చేసే ముందు చూసుకోవాలని చెప్పారు. అయితే ప్రసాదం కౌంటర్‌లోవారికి చెప్పగా.. వారు మరో పులిహోర ప్రసాదం ప్యాకెట్ ఇచ్చినట్లు వారే స్వయంగా చెప్పారు. పులిహోర ప్రసాదం తయారీ విభాగంలో సోషల్ మీడియాలో ఈ జంట పోస్ట్ చేసిన వీడియోను పరిశీలించిన తర్వాత అనుమానాస్పదంగా అనిపించింది.
పులిహోర తయారీకి అవసరమైన చింతపండు నానబెట్టిన తర్వాత మిషన్లు ద్వారా గుజ్జు తీస్తారు. కాబట్టి చింతపండులో నత్త వచ్చే అవకాశం లేదు. పులిహోరలో వేసే పోపు సామాన్లైన ఎండుమిర్చి, ఆవాలు, శెనగపప్పు, వేరుశెనగపప్పు, మెంతులు ముందుగానే నూనెలో వేయించి కలుపుతారు. కాబట్టి పోపుల తయారీలో కూడా నత్త వచ్చే అవకాశం లేదు. పోపులకు సంబంధించిన సామాన్లను సెంట్రల్ స్టోర్స్ నుంచి బాగుచేసిన తర్వాతే ప్రసాదంలోకి వాడతారు' అని తెలిపారు.
పులిహోర తయారీకి అవసరమైన బియ్యాన్ని బాయిలర్‌లలో పసుపుతో ఉడికించిన తర్వాతే కలపడానికి పెద్ద స్టీల్ ట్రేలో పోస్తారు. అక్కడ ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉంటారు.. తలకు క్యాప్ పెట్టుకుని గరిటెలతో కలుపుతారు. కాబట్టి అక్కడ కూడా నత్త కలిసే అవకాశం లేదు. పులిహోర తయారు చేసే సిబ్బంది కూడా తాము 30 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నామని.. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరగలేదని లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ నెల డిసెంబర్ 29 2025న 15వేల పులిహోర ప్యాకెట్లు విక్రయించారు. పులిహోర రుచిలో, పరిమాణంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సోషల్ మీడియా వేదికగా భక్తులు కూడా భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు ఇవ్వలేదు. పులిహోర తయారీకి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తొలిసారి' అన్నారు.
'పులిహోర కౌంటర్‌లో ఉద్యోగి కూడా తాను ఎలాంటి పరుషపదజాలం ఉపయోగించలేదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. కానీ ఇలాంటి ఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను పరిశీలించిన తర్వాత.. ఆ ఇద్దరు భక్తులు కౌంటర్‌లో పులిహోర ప్యాకెట్ కొనుగోలు చేసిన తర్వాత బయటకు తీసుకెళ్లి నత్తను కలిపి.. కొంత సమయం తర్వాత తీసుకొచ్చి ఇలా చూపించినట్లుగా అనుమానం ఉంది. ఈ ఘటనపై గోపాలపట్నం SHO విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాము' అని దేవస్థానం ఏఈవో రమణమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ జంటపై బీఎన్ఎస్ 298, 353(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa