ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.దేశ పురోగతి కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను చూసి గర్వపడుతున్నామన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన యునిఫైడ్ పెన్షన్ స్కీమ్(యుపిఎస్) ఉద్యోగుల సంక్షేమం, సురక్షితమైన భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను చూపుతుందన్నారు. ఉద్యోగుల భవిష్యత్తుకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని ప్రధాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. యూపీఎస్‌లో యూ అంటే మోదీ ప్రభుత్వ యూటర్న్ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అధికార అహంకారాన్ని జూన్4న దేశ ప్రజలు మట్టుబెట్టారని, అప్పటినుంచి ప్రతి విషయంలో మోదీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందని ఖర్గే విమర్శించారు.