అమరావతి రాజధానికి రైలుమార్గం ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని 2014-19 మధ్యనే టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పట్లో కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ-1 ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టుని మంజూరు చేయించింది. ఈ రైలుమార్గం మొత్తం పొడవు 106 కిలోమీటర్లు. ఇందులో ఒక సెక్షన్ ఎర్రుపాలెం - నంబూరు మధ్య 55.8 కిలోమీటర్ల పొడవు, రెండోది అమరావతి - పెదకూరపాడు 24.5 కిలోమీటర్లు, మూడోది సత్తెనపల్లి - నరసరావుపేట 25 కిలోమీటర్ల పొడవునా డీపీఆర్ కూడా ఆమోదించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2679.59 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ రైలుమార్గానికి అవసరమయ్యే భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. అయితే ఎన్‌డీఏ-1 చివరలో బీజేపీ, టీడీపీకి మధ్య అభిప్రాయభేదాలతో ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ప్రస్తావన అనేది ఐదేళ్లలో తీసుకురాలేదు. దాంతో ఏటా కేంద్ర బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.లక్ష మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటం, అందులో టీడీపీ భాగస్వామ్యం కావడంతో అమరావతి రైలుమార్గానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.