మద్యం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ బినామీల ఆస్తులపై సీఐడీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. విలువైన భూములు ఉన్నట్టుగా సమాచారం సేకరించారు. దీంతో కమీషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు, బినామీల పేరిట ఉన్న ఆస్తుల గుర్తింపులో పురోగతి లభించినట్టయింది. మద్యం కమీషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు, లేదా వారి బినామీలతో పాటు పెట్టుబడులు, ఆస్తుల క్రయ విక్రయాలు, కంపెనీల ఏర్పాటుపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను సీఐడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. పూర్తి వివరాలను సేకరించిన తర్వాత సాక్ష్యాలను పరిశీలించాలని నిర్ణయించింది. పూర్తి వివరాలు అందిన తర్వాత మాత్రమే కేసులో అరెస్టులు ప్రారంభించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.