వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. తానే పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నానని అన్నారు. తనను పార్టీ పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, వైసీపీకి దూరంగా ఉండటానికి గల కారణాలు, ఏ పార్టీలో చేరబోతున్నారనే పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్నారా? అని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా.. పార్టీనే తనను దూరం పెట్టిందని చెప్పుకొచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ అందడం లేదన్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చెబుదామని ప్రయత్నించానని, కనీసం ఎవరూ వినే పరిస్థితిలో కూడా లేరన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేశానని.. అయినా ఎవరూ తన వైపు చూడటం లేదన్నారు. అందుకే ఎన్నికల తరువాత మాత్రం పార్టీకి దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు.