ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్‌శాతం పెరుగుదలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2024, 04:39 PM

రాష్ట్రంలో ఇటీవ‌ల‌ జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌శాతం పెరుగుదలపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సీఈవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియా మాట్లాడుతూ.. వైసీపీ అనుమానాలు ఈసీ నివృత్తి చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. తమకు ఎన్నికల ఫలితాలపై మొదటి నుంచి అనుమానం ఉందని, ఓట్‌ ఫర్‌ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ కూడా తాజాగా అనుమానాలు చేసిందని గుర్తు చేశారు.
ఈవీఎం యంత్రాల్లో ఎన్ని ఓట్లు పడ్డాయో వీవీ ప్యాట్‌ లో కూడా అంతే సంఖ్యను చూపించాల్సి ఉండగా ఏపీలో ఆ విధంగా జరుగలేదని ఆరోపించారు. పోలింగ్‌ గడువు ముగిసే సమయానికి 68.12 శాతం ఓటింగ్ జర‌గ‌గా, రాత్రి తరువాత మరోరకంగా, జూన్‌ 4న లెక్కింపు రోజున 82 శాతం పోలింగ్‌ జరిగిందని పేర్కొనడంపై తమకు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. దాదాపు 12 శాతానికి పైగా తేడా ఉండటం అసాధారణమని, ఇదే విషయమై తాము పలుమార్లు ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్‌ సరైన సమాధానం తెలియజేయకపోవడం అనుమానాలకు తావిస్తోంద‌న్నారు. ఫారం 20లో పార్టీల వారీగా ఓట్లను ప్రకటించాల్సి ఉండగా నేటి వరకు ఓట్లను ప్రకటించ‌లేదన్నారు. ఏయే అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించడం లేదని అంబ‌టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com