తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పోలీసులను కోరారు. కొందరు ఓ వీడియో ద్వారా ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కంగన సదరు వీడియోను మహారాష్ట్ర డీజీపీకి పోస్టు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ పోలీసులను కూడా వీడియోకు ట్యాగ్ చేశారు. కాగా, కంగనా తాజాగా నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ఇటీవల మూవీ టీజర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగన నటించింది. ఇక కంగనాను వీడియో ద్వారా బెదిరించిన వ్యక్తులు ఓ గదిలో కూర్చుని ఉన్నారు. అందులో ఇద్దరి వేషధారణ మాత్రం నిహంగ్ సిక్కుల తరహాలో ఉంది.
ఒకవేళ ఆ సినిమా విడుదలైతే, అప్పడు దాన్ని ఖండిస్తామని సదరు వ్యక్తులు వీడియోలో చెప్పారు. అలాగే ఓ వ్యక్తి మీ చిత్రాన్ని చెప్పులతో కొడుతామని హెచ్చరించారు. ఒకవేళ ఎమర్జెన్సీ సినిమాలో ఖలిస్థానీ నేత జర్నెయిల్ సింగ్ భింద్రన్‌వాలేను ఉగ్రవాదిగా చిత్రీకరిస్తే ఊరుకోబోమని వారు హెచ్చరించారు. ఇందిరా గాంధీకి ఏం జరిగిందో గుర్తు ఉంచుకోవాలని బెదిరించారు. భింద్రన్‌వాలేను కొనియాడుతూ విక్కీథామస్ సింగ్ అనే వ్యక్తి హెచ్చరించారు. ఇందిరను హత్య చేసిన బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ గురించి కూడా ఆ వ్యక్తి వీడియోలో ప్రస్తావించాడు. దీంతో ఈ వీడియోను కంగన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేశారు. వీడియోను పోలీసులకు ట్యాగ్ చేసి తనకు రక్షణ కల్పించాలని కోరారు.