విజయవాడలో దారుణం జరిగింది. బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో సొంత అన్నను తమ్ముడు హత్య చేయడం కలకలంరేపింది. గొల్లపూడి సాయిపురంకాలనీలో నివాసం ఉంటున్న గాలి తమ్మయ్య కూలికి వెళ్తూ జీవిస్తున్నాడు.. ఆయనకు రాము, సూర్రెడ్డి, లక్ష్మారెడ్డి ముగ్గురు కుమారులు. ఆదివారం రాత్రి రాము ఇంటికి సోదరుడైన లక్ష్మారెడ్డి వెళ్లాడు.. తన భార్య రొయ్యల బిర్యానీ తీసుకు రమ్మని అడిగిందని.. అందుకు డబ్బులు ఇవ్వాలని రామును లక్ష్మారెడ్డి అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని రాము చెప్పాడు.. డబ్బులు ఎందుకు ఇవ్వవని లక్ష్మారెడ్డి రాముతో వాగ్వాదానికి దిగాడు.
ఆగ్రహంతో రాము చెంపపై లక్ష్మారెడ్డి కొట్టడంతో.. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో లక్ష్మారెడ్డి కిటికీ చెక్కతో రాము తలపై కొట్టగా కింద పడిపోయాడు. లక్ష్మారెడ్డిని రాము భార్య అడ్డుకున్నా ఆగలేదు.. కొడుతూనే ఉండడంతో రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు లక్ష్మారెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రాము మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. లక్ష్మారెడ్డి బిర్యానీ కోసమే అన్న రామును చంపేశాడా?.. వేరే కారణాలతో హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం.. ఇద్దరి మరణంతో విషాదం
విజయవాడలో మరో విషాద ఘటన జరిగింది. కవల పిల్లల పుట్టిన రోజు చేసుకున్న సంతోషం నిలవలేదు.. గంటల వ్యవధిలోనే ఇద్దరి మరణాలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. సాహేదా బేగం, జరీనా బేగంలు అక్కాచెల్లెళ్లు కాగా.. భవానీపురంలో సాహేదా బేగం కుమారుడు ఖాజా మహ్మద్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. మహ్మద్ చిన్నమ్మ అయిన జరీనా బేగం గంగూరులో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి భవానీపురంలో ఖాజా మహ్మద్ కవల పిల్లల రెండో పుట్టినరోజు వేడుకను ఘనంగా చేసుకున్నారు.
ఖాజా మహ్మద్ భోజనం చేసిన తర్వాత 11 గంటలకు నిద్రపోయేందుకు సిద్ధమయ్యాడు.. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడు. ఈ విషయం తెలియడంతో పిన్ని జరీనా బేగం గంగూరు నుంచి అర్ధరాత్రి 2 గంటలకు భవానీపురం వచ్చారు. సోదరి కుమారుడైన మహ్మద్ చనిపోవడాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె కూడా ఒక్కసారిగా కుప్పకూలారు.. ఆమెను ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవటంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి. సోమవారం ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. పుట్టిన రోజు ఘనంగా నిర్వహించామనే సంతోషంలో ఉన్న ఆ కుటుంబాలు.. ఇద్దరి మరణంతో కన్నీరుమున్నీరయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.