ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయండి.. లక్షల్లో సంపాదించండి

national |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2024, 11:07 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా మీడియా కంటే ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ మూలన జరిగినా క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. అయితే ఇది ఒక రకంగా మంచిదే అయినా.. చాలా వరకు సోషల్ మీడియాను దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ కేసుల పాలై జైళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారిని జీవితాంతం జైలులోనే ఉండేలా కఠిన చట్టానికి యూపీ కేబినెట్ ఆమోదం కల్పించింది.


ఇక సోషల్ మీడియా సైట్ల ద్వారా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే ఇలాంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు యోగి సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ కొత్త పాలసీలు, పథకాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, సర్కార్ సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చని తెలిపింది. గరిష్ఠంగా నెలకు రు.8 లక్షల వరకు.. ప్రభుత్వ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి సంపాదించుకోవచ్చని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ పాలసీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు అవసరమైన ఉద్యోగ అవకాశాలను కూడా అందిస్తుందని పేర్కొంది. ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నెలకు రూ.3 లక్షలు, రూ.4 లక్షలు, రూ.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చని.. అదే విధంగా యూట్యూబ్‌లో రూ.8 లక్షలు, రూ.7 లక్షలు, రూ.6 లక్షలు, రూ.4 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంటుందని సర్కార్ తెలిపింది.


ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దేశ వ్యతిరేక కంటెంట్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన కొత్త సోషల్ మీడియా పాలసీకి ఉత్తర్‌ప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అభ్యంతరకరమైన సోషల్ మీడియా కంటెంట్‌ను నిరోధించడానికి ఈ పాలసీలో కొన్ని మార్గదర్శకాలను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రూపొందించింది. ఈ కొత్త సోషల్ మీడియా విధానం ప్రకారం.. దేశ వ్యతిరేక కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వ్యాప్తి చేయడాన్ని తీవ్రమైన నేరంగా యూపీ ప్రభుత్వం పరిగణించింది. ఇలాంటి కంటెంట్ వల్ల తక్కువలో తక్కువ 3 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాకుండా గరిష్ఠంగా జీవిత ఖైదుతోపాటు భారీగా జరిమనాలు విధించే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇలా సోషల్ మీడియాలో దేశవ్యతిరేక వార్తలను పోస్ట్ చేసేవారిపై గోప్యతా ఉల్లంఘనలు, సైబర్ టెర్రరిజంతో వ్యవహరించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66E, 66F సెక్షన్ల కింద నమోదు చేసే వారు.


ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీలత లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశాన్ని ఈ కొత్త సోషల్ మీడియా పాలసీలో యోగి సర్కార్ రూపొందించింది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌పై చట్టపరంగా ఎదుర్కొనేందుకు ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగపడనుంది. ఈ మేరకు సోషల్ మీడియా కంటెంట్‌ని పరిశీలించే బాధ్యతలను వీ-ఫోరమ్ అనే డిజిటల్ ఏజెన్సీకి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అప్పగించింది. సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వీడియోలు, ట్వీట్‌లు, పోస్ట్‌లు, రీల్స్‌పై ఈ వీ -ఫోరమ్ సంస్థ నిఘా పెట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com