కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రిగా పవనకల్యాణ్‌లు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సంయుక్తంగా ప్రజలు ముందుకు రానున్నారు. ఇందుకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వేదిక కానున్నది. మండలంలోని కాకాని వద్ద జేఎన్‌టీయూ కళాళాల ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీ వనమహోత్సవం జరగనున్నది. ఈ కార్యక్రమం చంద్రబాబు, పవనకల్యాణ్ కలిసికట్టుగా పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు, పవనకల్యాణ్ పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. హెలిప్యాడ్, సభా స్థలి ఏర్పాట్లపై అధికారులతో వారు సమీక్షించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు, ఆర్డీవో సరోజ, తహసీల్దార్ వేణుగోపాల్ తదతరులు పాల్గొన్నారు.