అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునేందుకు కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటామని ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటనతో కలకలం రేగింది. ఈ నిర్ణయం 70వేల మంది విదేశీ విద్యార్థులను ప్రభావితం చేయనుండగా... వీరిలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. దీంతో ఆందోళనకు గురవుతోన్న విదేశీ విద్యార్థులు నిరసనలకు దిగారు. ప్రిన్స్‌ఎడ్వర్డ్ ఐలాండ్‌తోపాటు అంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియాల్లో ర్యాలీలు చేపట్టారు.
విదేశీ వర్కర్ల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న కెనడా.. అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇదే అంశంపై ట్రూడో సర్కారు చర్చించింది. ఇందులో భాగంగా విదేశీ వర్కర్ల విధానంలో మార్పులు చేసింది. ఇవి సెప్టెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఇందులో నిర్మాణ, ఆరోగ్య, ఆహార భద్రత రంగాల్లో పనిచేసేవారికి మినహాయింపు ఉంటుందని కెనడా ప్రధాని పేర్కొన్నారు. కెనడీయుల్లో నిరుద్యోగంతో పాటు విదేశీ తాత్కాలిక వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరగడంపై ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు.
తక్కువ వేతనానికి పనిచేసే విదేశీ కార్మికులపై ఆధారపడటం కంటే శిక్షణ, సాంకేతికలపై కెనడా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా శాశ్వత నివాసితుల అనుమతుల్లోనూ గణనీయ మార్పులపై కూడా క్యాబినెట్‌లో చర్చిస్తున్నట్లు చెప్పారు. కొత్త విధానం శాశ్వత నివాస దరఖాస్తుల సంఖ్యను 25 శాతం మేర తగ్గించడంతోపాటు స్టడీ పర్మిట్‌లను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్సుల అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. ఒంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియాలోనూ ఇటువంటి నిరసనలు కొనసాగాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి వేగవంతంగా పెరుగుదలను నమోదయిన నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చింది. ఫెడరల్ డేటా ప్రకారం.. కెనడాలో గత సంవత్సరం జనాభా పెరుగుదలలో దాదాపు 97 శాతం మంది ఇమ్మిగ్రేషన్ ద్వారా వచ్చినవాళ్లు.
స్టూడెంట్ అడ్వకేసీ గ్రూప్ నౌజవాన్ సపోర్ట్ విభాగానికి చెందిన ప్రతినిధులు.. గ్రాడ్యుయేట్‌ల వర్క్ పర్మిట్‌ల గడువు ఈ ఏడాది చివరిలో ముగిసే సమయానికి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థి మెహక్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. నా జీవితంలో అత్యంత కీలకమైన ఆరేళ్లు.. నేను కెనడాకు రావడానికి చాలా రిస్క్‌లు తీసుకున్నాను అని చెప్పారు. ఇలాంటి బాధితులు చాలా మందే అక్కడ ఉన్నారు.