సమాజ శేయస్సు దృష్ట్యా మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని, గంజాయి రవాణా, అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కిపడేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలపై మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సృజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణిచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం వుందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా వుంచాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో యాంటీ నార్కోటిక్ క్లబ్‌లు ఏర్పాటు చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే పెడ్లర్స్‌ను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతటి వారైనా కేసులు నమోదు చేసేందుకు వెనుకాడబోమన్నారు. పోలీసు, రెవెన్యూ, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మండలస్థాయిలో బృందాలుగా ఏర్పడి గ్రామాలలోని పాఠశాలలు, కళాశాలల పరిసరాలలో బడ్డీకొట్లు, దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి గంజాయి, మాదక ద్రవ్యాలను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.