ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ చెప్పారు. జగన్ పత్రికపై వేసిన కేసులో విచారణ నిమిత్తం గురువారం ఆయన విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కోర్టు బయట విలేకరులతో మాట్లాడారు. భూఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నివేదిక సిద్ధం చేశారని, దీనిపై వచ్చే కేబినెట్‌లో చర్చించి అక్రమాలకు బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన అధికారుల వివరాలను రెడ్‌బుక్‌లో రాశానని... వారిపై చర్యలు ఉంటాయని వివరించారు. గత ప్రభుత్వం వెయ్యి బడుల్లో సీబీఎ్‌సఈ సిలబస్ అమలు చేసిందని, అందుకు తగినవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దలేకపోయిందన్నారు. దీనివల్ల ఇటీవల అసె్‌సమెంట్ పరీక్షలలో 65 శాతం మంది ఫెయిల్ అయ్యారన్నారు. ఈ నేపథ్యంలో సీబీఎ్‌సఈ సిలబస్ కొనసాగింపు, సంబంధిత బోర్డు పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పాఠశాలల్లో వసతుల కల్పన కోసం ‘మన బడి-మన భవిష్యత్తు‘ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. వైసీపీ పాలకుల నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 లక్షల నుంచి 35 లక్షలకు పడిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టేలా రోడ్‌మ్యాప్ అమలుచేస్తామన్నారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకువస్తామని, విశాఖను ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ముంబైకు చెందిన సినీనటిని 18 రోజులు బంధించి, వేధింపులకు పాల్పడ్డారనే విషయం ఆమె ఆవేదన చూస్తే అర్థమవుతుందన్నారు. వాటిలో అధికారుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోందని, అన్నింటిపై విచారణ జరగాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకుంటామని లోకేశ్ చెప్పారు. కాగా, మంత్రి లోకేశ్ గురువారం విశాఖ నగరంలోని 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు తనను ఉద్దేశించి కథనం ప్రచురించిన జగన్ పత్రికపై గతంలో ఆయన పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు వాయిదాకు హాజరయ్యారు. ప్రతివాది తరపున న్యాయవాది మహ్మద్ హాబీబుల్లా కోర్టులో లోకేశ్‌ను పలు ప్రశ్నలు అడిగారు. న్యాయమూర్తి కేసును అక్టోబరు 18కి వాయిదా వేశారు.