కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సమీక్షించారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు.వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు వెల్లడించారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవని వారు తెలిపారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ, సీఎం పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని చెప్పారు. దీంతో వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా, వారికి మందులు కూడా లభించడం లేదని, చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.కాగా, నిన్న (సోమవారం) తన పర్యటనలో వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న శ్రీ వైయస్ జగన్, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, అయినా నింద తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని శ్రీ వైయస్ జగన్ వివరించారు.