ఈ ఆధునిక సాంకేతిక యుగంలో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఏ మూల చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. మెటా ఏఐ నుంచి కావాల్సిన సమాచారాన్ని సులువుగా పొందుతున్నాం. రోజూవారీ జీవితంలో భాగమైపోతున్న కృత్రిమ మేధ.. తాజాగా ఓ యువతి ప్రాణాలు కాపాడింది. భర్త వదిలేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారి పోలీసులకు ఏఐ అలర్జ్ జారీచేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమై క్షణాల్లోనే అక్కడకు చేరుకుని యువతిని రక్షించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లక్నో సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (21).. పొరుగూరు యువకుడ్ని (23) ప్రేమించింది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో నాలుగు నెలల కిందట ఇద్దరూ రహస్యంగా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చిక్కొచ్చిపడింది. వారి వివాహాం చట్టపరంగా చెల్లుబాటు కాకపోవడంతో వివాదాలు మొదలయ్యాయి. దీంతో ఆమెను వదలిపెట్టి యువకుడు వెళ్లిపోయాడు. ఎంతగానో ప్రేమించిన భర్త దూరం కావడంతో ఆ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
తాను చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. తాను ఎందుకు చనిపోవాలనుకుంటుందో ఓ వీడియోలో వివరించింది. కొద్ది సేపటికే ఆ వీడియో వైరల్ కావడంతో దీని గురించి యూపీ డీజీపీ కార్యాలయానికి మెటా ఏఐ అలర్డ్ జారీ చేసింది. దీంతో పోలీసులు అలర్ట్ అయి.. నిమిషాల వ్యవధిలో ఆమె గ్రామాన్ని గుర్తించారు. వెంటనే పోలీసు బృందం ఘటనాస్థలానికి చేరుకుని, ఆమె ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుంది. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువకుడ్ని అరెస్టు చేశారు.
‘‘యువతి సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో ఏఐ నుంచి శనివారం మధ్యాహ్నం డీజీపీ ఆఫీసుకు అలర్ట్ వచ్చింది.. వెంటనే సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాం.. తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం తల్లిదండ్రులకు కూడా ఆ సమయంలో తెలియదు. అయినా.. ఏఐ అలర్ట్‌తో ఆమెను కాపాడగలిగాం. ఆమెకు కౌన్సిలింగ్‌ను కొనసాగిస్తున్నాం’ అని మోహన్‌లాల్ గంజ్ ఏసీపీ రజనీశ్ వర్మ తెలిపారు.