ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీరు అందరికీ తెలిసిందే. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోని వ్యక్తి ఆయన. ఒకట్రెండు సందర్భాలు మినహా ఎప్పుడూ స్థిరంగానే ఉంటారు. అయితే బుధవారం సీఎం చంద్రబాబు కాస్త ఆవేశానికి గురయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో వరదల పరిస్థితి, సహాయక చర్యలపై చంద్రబాబు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫైర్ అయ్యారు. వరదల నేపథ్యంలో అధికారులను బురదలో దించి మరీ పని చేయిస్తుంటే.. కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసేవారిని అమరావతిలో పూడ్చేయాలంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు పలువురు ప్రముఖులు సాయం చేస్తున్నారన్న చంద్రబాబు.. ఇలాంటి సమయంలో సహాయం చేయకుండా అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని సంఘం నుంచి బహిష్కరించాలని ఫైర్ అయ్యారు.
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు సీఎం దృష్టికి వచ్చాయి. దీంతో ప్రైవేట్ బోట్ల యజమానులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపుతామంటూ తీవ్రంగా హెచ్చరించారు. అలాగే పాలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులను కొంతమంది అధిక రేట్లు అమ్ముతున్న వైనం కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. దీంతో ఈ విషయంలో విజిలెన్స్‌ను రంగంలోకి దింపుతామని చంద్రబాబు చెప్పారు. అలాగే నిత్యావసరాలు, కూరగాయల ధరలపై నిఘా పెట్టామని, ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు కృష్ణానదికి మరో 40 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి ఉంటే మరింత ప్రమాదం జరిగేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని వివరించారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు చెప్పారు. 2019 నుంచి బుడమేరులో ఆక్రమణలు పెరిగాయన్న చంద్రబాబు.. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తోందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ చేసిన తప్పులకు అమాయకులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. బుడమేరు మార్గంలో న్న కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తామన్న చంద్రబాబు.. అలాగే వరద బాధితులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.