తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. సచివాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హైడ్రా అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు, హైడ్రాను ఏర్పాటు చేసి మంచి పని చేశారని కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను పరిరక్షించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన హైడ్రా అభినందనీయమన్న పవన్.. చెరువులను కాపాడే విషయంలో రేవంత్ మంచిపని చేశారన్నారు.
అక్రమ నిర్మాణాలనేవి లేకుంటే ఇలాంటి విపత్తులు రావని పవన్ అన్నారు. ఇక హైడ్రా లాంటి వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ఉండాలన్న పవన్ కళ్యాణ్..ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రికి ఓ సలహా ఇచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే కట్టిన నిర్మాణాలకు పరిహారం ఇచ్చి కూల్చివేయాలని.. మానవతా కోణంలో ఆలోచించాలని పవన్ సూచించారు.
మరోవైపు బుడమేరులో జరిగిన ఆక్రమణలే విపత్తుకు కారణమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయపడ్డారు. విపత్తు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థంగా పనిచేస్తున్నారని.. ఈ వయసులోనూ ఆయన ట్రాక్టర్లు, జేసీబీలలో పర్యటిస్తున్నారని అన్నారు. అలాంటి వారిని అభినందించాల్సి పోయి.. విమర్శించడం తగదని వైసీపీకి హితవు పలికారు. ఆరోపణలు చేసే ముందు వైసీపీ నేతలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. మరోవైపు తాను వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని పవన్ అన్నారు. తన పర్యటనతో అధికారులపై ఒత్తిడి ఉంటుందనే ఆలోచనతోనే వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లలేదన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు కూడా ఆయన కౌంటరిచ్చారు. వైసీపీ నేతలు వస్తానంటే తనతో పాటు ఎక్కడికైనా రావొచ్చన్న పవన్ కళ్యాణ్.. తన కాన్వాయిలోనే వారిని తీసుకెళ్తానన్నారు. తనతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వస్తే ఎలా ఉంటుందో వారికే తెలుస్తుందని చెప్పారు. ఆ తర్వాత సలహాలు ఇవ్వొచ్చన్న పవన్.. రాష్ట్రానికి సమస్య వచ్చినప్పుడు ఇళ్లల్లో కూర్చుని విమర్శలు చేస్తే సరిపోదని.. సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.