చీరాల, సెప్టెంబరు 5 : విజయవాడ వరద బాధితుల సహాయార్థం స్పందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని, అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల పట్టణ పాస్టర్స్ ఆధ్వర్యంలో బాధితులకు దప్పట్లు, ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు తదితరాలను సమకూర్చారు. అందుకు సంబంధించిన వాహనాలను గడియార స్తంభం సెంటర్ వద్ద ఎమ్మెల్యే కొండయ్య జెండా ఊపి విజయవాడకు పంపించారు. వదర ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులు తిరిగి యథాస్థితికి వచ్చేందుకు ఎవరి వంతు తోడ్పాటు వారి అందించడం కర్తవ్యంగా భావించాలన్నారు. పాస్టర్స్ సాయం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పట్టణ పాస్టర్లు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చీరాల మండల వెలుగు కార్యాలయం పరిధిలో గ్రామ సంఘాల సభ్యులు, ప్రతినిధులు సేకరించిన బియ్యం, కందిపప్పు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లును తీసుకెళ్లే వాహనాలను ఎమ్మెల్యే కొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వెలుగు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈపురుపాలెంలో వరదబాధితులు సహాయార్ధం సమాఖ్య సభ్యులు సమకూర్చిన ఆహార పదార్థాల వాహనాలను ప్రారంభించారు. జాండ్రపేటలో టీడీపీ నేత సిద్ధి బుచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ సమాఖ్య సభ్యులు, యువత ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం ఆహారపదార్థాలను పంపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, సమాఖ్యల సభ్యులు, బాధ్యులు పాల్గొన్నారు.