ఆంధ్రప్రదేశ్‌లోని అకాల వర్షాలు సృష్టించిన జల ప్రలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ బుదర నీటిలో తిండి తిప్పలు లేకుండా గడుపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద వలన ఇప్పటి వరకు సంభవించిన లెక్కల వివరాలను వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది చనిపోయారు. ఇద్దరు మిస్ అయ్యారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు చనిపోయారు. పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారు. 1,69,370 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం జరిగింది. 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. 60 వేల కోళ్లు మృతి చెందగా.. 275 పశువులు మృతి చెందాయి. వరదల వలన 22 సబ్ స్టేషన్‌లు దెబ్బతిన్నాయి. 3,973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయి. వర్షం వరదల వలన 6,44,536 మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. 214 రిలీప్ క్యాంపుల్లో 45,369 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ టీమ్‌లు రంగంలో దిగాయి. 6 హెలికాఫ్టర్లు పనిచేస్తున్నాయి. 228 బోట్లను సిద్ధం చేశారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపారు. కృష్ణా నదికి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.