ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజలు సర్వస్వం కొల్పోయారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు మిగిల్చిన భారీ నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకొనేందుకు పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షల చొప్పున రాష్ట్రానికి కేటాయించాలని ఆయన విజ్జప్తి చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌లకు లేఖలు రాసినట్లు ఎంపీ బాలశౌరి వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో ఎంపీ వల్లభనేని బాలశౌరి విలేకర్లతో మాట్లాడతూ.. 2008లో బిహార్‌లోని కోసి నదికి భారీగా వరద పోటెత్తిందన్నారు. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలు నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభలోని మొత్తం సభ్యుల ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు బిహార్‌లోని నాడు సంభవించిన విపత్తుకు కేటాయించాలంటూ ప్రభుత్వం లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్బంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రస్తావించారు.