ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌లో చేరిన వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా

national |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 09:49 PM

రెజ్లింగ్ ఆటతోనే కాకుండా.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా గతేడాది దేశవ్యాప్తంగా ఉద్యమం చేసిన స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా.. తాజాగా హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వీరిద్దరు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఇప్పటివరకు భారతీయ రైల్వేల్లో ఉద్యోగాలు చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. మరోవైపు.. వారు ఇటీవలె కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ నేపథ్యంలోనే వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా.. మరికొన్ని రోజుల్లో జరగనున్న హర్యానా శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు.


హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇటీవల సమావేశం అయి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిపింది. ఈ నేపథ్యంలోనే వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఈ ఇద్దరు రెజ్లర్లు.. రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రాహుల్‌తో.. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా భేటీ అయిన ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్ చేయడంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం అయ్యాయి.


ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ కాంగ్రెస్‌ అభ్యర్థుల లిస్ట్‌ను అతి త్వరలో 1, 2 రోజుల్లో హస్తం పార్టీ హైకమాండ్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటి లిస్ట్‌లోనే వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు టికెట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక వినేష్ ఫోగట్.. ఈ ఎన్నికల్లో దాద్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ స్థానంలో బీజేపీ తరఫున వినేష్ ఫోగట్ సోదరి బబితా ఫోగట్.. గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.


ఇక ఈ ఎన్నికల్లో కూడా ఆమెకు కమలం పార్టీ మరోసారి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే దాద్రి నియోజకవర్గంలో ఫోగట్ సిస్టర్స్ పోటీ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మరింత రసవత్తరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 5వ తేదీన జరగనుండగా.. కౌంటింగ్, ఫలితాల వెల్లడి అదే నెల 8వ తేదీన ప్రకటించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com