ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టపగలే, నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 09:50 PM

రోజురోజుకూ సమాజంలో మనుషుల్లో మానవత్వం అనేదే కనుమరుగై పోతోంది. రోడ్డు మీద ఏం జరిగినా మనకేం సంబంధం లేదు అనుకుంటూ కొందరు వెళ్లిపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మరికొందరైతే అక్కడ జరిగే ఘటనను ఆపాల్సింది పోయి వేడుక చూస్తున్నట్లు చూస్తున్నారు. ఇక స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైన తర్వాత.. ఏం జరిగినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. హత్యలు, దాడులు, అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలు జరుగుతున్నప్పటికీ అవేమీ పట్టనట్టు.. వాటిని వీడియోలు తీయడమో లేక తమకేం సంబంధం లేదని వెళ్లిపోవడమో చేస్తున్నారు. అయితే చేసేవాడిది ఎంత తప్పు ఉందో.. అలాంటి ఘటనలను చూసి కూడా ఆపకుండా ఉత్సవ విగ్రహంలా ఉండేవారిది కూడా అంతే తప్పు ఉంటుంది. ఇలాంటి సంఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లో ఒకటి చోటు చేసుకుంది.


పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. ఓ దుర్మార్గుడు ఫుట్‌పాత్‌ పైనే ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే రోడ్డుపై వెళ్తున్న వారు.. ఆ అఘాయిత్యాన్ని ఆపడం అటుంచితే.. ఆ దారుణాన్ని వీడియో కూడా తీశారు. అంతటితో ఆగకుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియో వైరల్ కావడంతో మహిళపై లైంగిక దాడిని చేసిన నిందితుడిని ఎంత తిడుతున్నారో.. ఆ ఘోరాన్ని ఆపకుండా చోద్యం చూస్తూ వీడియో తీశారని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో బుధవారం (సెప్టెంబర్ 4వ తేదీ) జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అయింది. ఉజ్జయినీ నగరంలోని రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి.. మహిళను రేప్ చేశాడు. ఆ దారుణాన్ని అక్కడ ఉన్న కొందరు వీడియో తీయడం సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు బాధితురాలు నేరుగా కోట్వాలీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది.


తనపై లోకేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఉజ్జయిని ఎస్పీ ఓం ప్రకాష్ మిశ్రా వెల్లడించారు. అయితే బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే ఆమె దగ్గర సమాచారం తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా లోకేష్‌ను 2 గంటల్లోనే పట్టుకున్నట్లు వివరించారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నించగా.. నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని.. ఆ తర్వాత రోజు గురువారం కోర్టులో హాజరు పరచగా.. కోర్టు ఆదేశాల మేరకు అతడ్ని భేరుగఢ్ జైలుకు తరలించినట్లు చెప్పారు. ఇక ఈ ఘటన ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వివాదానికి కారణం అయింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు.


మరోవైపు.. గతేడాది కూడా ఉజ్జయిని నగరం సమీపంలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరగ్గా.. తీవ్రమైన గాయాలతో, అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చింది. తనను కాపాడాలని ఇంటింటికీ వెళ్లి డోర్ కొట్టినా ఎవరూ స్పందించలేదు. చివరికి ఆ బాలికను చూసిన ఓ పూజారి.. ఆమె దగ్గరికి వెళ్లి తన బట్టలు ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకున్నారు. ఆమెకు ఒళ్లంతా రక్తం కారుతోందని, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉందని.. బట్టలు కూడా పూర్తిగా లేక అర్ధనగ్నంగా ఉందని.. భయం భయంగా ఉందని ఆ పూజారి పోలీసులకు వివరించాడు. అయితే ఆ బాలిక సహాయం కోసం ఇంటింటికీ తిరిగి తలుపు కొట్టినా ఎవరూ తీయకపోవడం.. అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com