సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. సీతారాం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.. అప్పటి నుంచి ఎమర్జెన్సీ వార్డులో వైద్యం కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రి సీతారాం ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఐసీయూకి తరలించి వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీతారాం ఏచూరికి ఇటీవలే కాటరాక్ట్ సర్జరీ కూడా అయ్యింది. అప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్లడం లేదు.. అయితే ఎయిమ్స్‌లో చేరిన తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య స్మారక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీతారాం ఏచూరి వెళ్లాలని భావించారు.. కానీ అనారోగ్యం కారణంగా దూరంగా ఉన్నారు. మరోవైపు సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై సీపీఎం నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ బులిటెన్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరగా.. ఆగస్టు 31న ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సీపీఎం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరినట్లు.. అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఆయన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని ప్రకటనలో తెలిపారు. అయితే గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తలపై మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఆయన హెల్త్ బులిటెన్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు.. ఎయిమ్స్ డాక్టర్స్ ప్రకటన చేస్తే ఆయన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు.. తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి. వాస్తవానికి ఏచూరి కుటుంబానిది కాకినాడ కాగా.. తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజనీర్.. తల్లి ప్రభుత్వ అధికారి. ఆయన చదువు మొత్తం హైదరాబాద్‌లో సాగింది.. ఆ తర్వాత ఢిల్లీలో బీఏ చదివారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐలో చేరి సీపీఎం పార్టీకి దగ్గరయ్యారు.. అలా పార్టీలో సీనియర్ నేతగా ఎదిగారు.. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. అలాగే సీతారాం ఏచూరి ఎన్నో పుస్తకాలను కూడా రాశారు. ఆయనకు ముగ్గురు సంతానం, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె ఎడిన్‌బరోలో ఫ్రొఫెసర్, ఓ కుమారుడు జర్నలిస్ట్.. మరో కుమారుడు చదువుతున్నట్లు తెలుస్తోంది.