దేశంలో ఎక్కడైనా నగదు రహిత ప్రయాణం చేసేందుకు వీలు కల్పించేలా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్క కార్డుతో డబ్బులు లేకుండా ప్రయాణించేలా సుఖ్వీందర్ సింగ్ సుఖు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును గురువారం ప్రారంభించారు. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ)కి చెందిన ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ను ఉపయోగించి.. దేశవ్యాప్తంగా వివిధ ప్రజా రవాణాల్లో నగదు రహిత ప్రయాణానికి అనుమతిస్తుందని వెల్లడించారు. ఈ కార్డును ఉపయోగించి.. ప్రయాణికులు నగదు లేకుండానే దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు వీలు కల్పించారు.
అయితే ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించాలో కూడా ఈ సందర్భంగా సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు వెల్లడించారు. ఢిల్లీ మెట్రో, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, హర్యానా రోడ్‌వేస్, ముంబై బెస్ట్ బస్సులతో సహా ఇతర ప్రయాణాల్లో ఈ కార్డు ద్వారా నగదు లేకుండానే ప్రయాణించే వీలు ఉంటుందని వివరించారు. అయితే ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు కావాలంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇక హెచ్ఆర్టీసీ ఇప్పటికే యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. వీటికి అదనంగా క్యాష్ లెస్ ప్రయాణాలను మరింత ప్రోత్సహించడానికి కామన్ మొబిలిటీ కార్డును ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు.. దేశంలోనే తొలిసారిగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ను తీసుకువచ్చిన రాష్ట్రంగా నిలిచినట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని కొనియాడారు. దేశవ్యాప్తంగా వివిధ రవాణా వ్యవస్థల్లో ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడం.. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఆ కార్డు పనిచేస్తుందని వివరించారు. ఈ విధానాన్ని కేవలం 6 నెలల్లోనే కార్డును రూపొందించి అమల్లోకి తీసుకువచ్చిన హెచ్ఆర్‌టీసీ అధికారులను సీఎం సుఖ్వీందర్ అభినందించారు.