యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చైనా ఎంతటి అపఖ్యాతిని మూటగట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 70 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ఆ వైరస్ ఏమంత ప్రభావం చూపడంలేదు. అయితే, చైనాలో మరో ప్రాణాంతక వైరస్ కూడా ఉనికిని చాటుకున్నట్టు ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. దీన్ని వెట్ ల్యాండ్ వైరస్ అని పిలుస్తున్నారు. ఇది మెదడుపై ప్రభావం చూపుతుందని, ప్రాణాంతకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కీటకాల ద్వారా మానవులకు సంక్రమిస్తుందట. ఇది ఐదేళ్ల కిందటే బయటపడింది. తొలిసారిగా జిన్ జౌ నగరంలో 61 ఏళ్ల వృద్ధుడిలో కనుగొన్నారు. ఈ వైరస్ కారణంగా రోగిలో జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... ఇది యాంటీబయాటిక్ ఔషధాలకు కూడా లొంగని మొండి వైరస్ అని పరిశోధకులు అంటున్నారు. ఈ వెట్ ల్యాండ్ వైరస్ గొర్రెలు, పందులు, గుర్రాల్లో పేల ద్వారా వ్యాప్తి చెందుతుందని, తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని గుర్తించారు. ఇది మెదడుపై ప్రభావం చూపుతుందని, తద్వారా రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదముందని వైద్య నిపుణులు వివరించారు.