భారీ గోతులు ఏర్పడి, అధ్వానంగా ఉన్న ఇందేశమ్మ ఘాట్‌రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఇందేశమ్మఘాట్‌రోడ్డుతోపాటు రామచంద్రపురం వద్ద రెండు రోజుల క్రితం కుంగిన పురాతన వంతెనను ఆమెతోపాటు కల్టెర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపిక సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, కుంగిపోయిన వంతెనను తొలగించి పక్కనే డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నీటి మునిగిన పంటలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలను అధికారులకు సూచించారు. ఆమె వెంట నర్సీపట్నం ఆర్‌డీవో జయరాం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమంతి, ఈఈ రమేశ్, టీడీపీ నాయకులు లాలం కాశీనాయుడు, జానకి శ్రీనివాసరావు, తదితరులు వున్నారు.