తీవ్ర వాయుగుండం ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జన జీవనానికి అంతరాయం కలిగింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో పలుచోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బుచ్చెయ్యపేట మండలంలో తాచేరు డైవర్షన్ రోడ్డు వరద ధాటికి కొట్టుకుపోయింది. ఇదే మండలంలో వడ్డాది వద్ద పెద్దేరు నది తాత్కాలిక కాజ్‌వేను ముంచెత్తింది. నాతవరం మండలంలో వెదుళ్ల గెడ్డ పొంగడంతో నర్సీపట్నం- తుని మధ్య రాకపోకలు స్తంభించాయి. చీడికాడ, మండలం ఖండివరం సమీపంలో కాజ్‌వే కొట్టుకుపోవడంతో మాడుగులకు రాకపోకలు నిలిచిపోయాయి. పాయకరావుపేట మండలంలో తాండవ నది ఉగ్రరూపం దాల్చడంతో సత్యవరం వద్ద వంతెన మీదుగా వరద ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు ఆపేశారు. ఇంకా ఎస్.రాయవరం, కోటవురట్ల, మాడుగుల, తదితర మండలాల్లో కల్వర్టులు, ఎత్తు తక్కువ వంతెనల మీదుగా వరద నీరు ప్రవహించింది. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో వివిధ ప్రాంతాలకు నడిచే 36 బస్సులను సోమవారం రద్దు చేసినట్టు డీపీటీవో పద్మావతి తెలిపారు. నర్సీపట్నం నుంచి విశాఖ వైపు మినహా మిగిలిన అన్ని రూట్‌లలో బస్సులను నిలుపుదల చేశామని ఆమె చెప్పారు. బుచ్చెయ్యపేట మండలంలో డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడం, వడ్డాదిలో కల్వర్టుపై వరద ప్రవహించడంతో మాడుగుల వైపు ఒక్క బస్సు కూడా నడవలేదన్నారు. నర్సీపట్నం నుంచి శరభన్నపాలెం, కొయ్యూరు బస్సులు కృష్ణాదేవిపేట వరకు మాత్రమే తిప్పారు. దీంతో నర్సీపట్నం బస్టేషన్ బోసిపోయింది. మధ్యాహ్నం తరువాత కొన్ని రూట్లలో బస్సులను పునరుద్ధరించారు. చింతపల్లి మార్గంలో కాజ్‌వేలు కుంగిపోవడంతో మంగళవారం కూడా బస్సులు నడవవని అధికారులు తెలిపారు. అడ్డురోడ్డు వైపు వెళ్లే బస్సులు కోటవురట్ల మండంల రామచంద్రపురం వంతెన వరకు, చోడవరం, మాడుగుల బస్సులు వడ్దాది వరకు నడుపుతారు.