విజయవాడ వరదలు ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధానికి కారణమవుతున్నాయి. మీరంటే మీరు కారణమంటూ రెండు పార్టీల నేతలూ ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇక విజయవాడ వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఇదే క్రమంలోనే ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. లక్షల మంది జనాన్ని చంపాలని వైఎస్ జగన్ కుట్రలు చేశారని.. అదిప్పుడు బట్టబయలైందంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
"అధికారం అండగా జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి, 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజి ఢీకొట్టి కూల్చేయాలని.. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామ రూపాలు లేకుండా చేసి, లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది జగన్ అయితే, ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విషప్రచారం చేస్తుంది జగన్ ముఠా." అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఇటీవల భారీ వర్షాలు. వరదలు విజయవాడను ముంచెత్తాయి. ఇదే క్రమంలోనే కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగి.. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. అయితే వరదనీటితో పాటుగా పడవలు వచ్చి బ్యారేజీ గేట్ల వద్ద ఢీకొన్నాయి. దీంతో రెండు గేట్లు దెబ్బతిన్నాయి. అయితే ఈ బోట్లు వైసీపీ వారివేనని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు బ్యారేజీ వద్ద బోట్లను తొలగించే పనులను ప్రారంభించారు. రెండు భారీ క్రేన్ల సాయంతో జలవనరులశాఖ ఇంజినీర్లు వీటిని తొలగిస్తున్నారు. బ్యారేజీలోని 67, 68, 69 గేట్ల వద్ద ఉన్న నాలుగు పడవలను ఈ క్రేన్ల సాయంతో తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 68, 69 గేట్లను మూసివేసి పనులు కొనసాగిస్తున్నారు.