ఏపీ రాజధాని అమరావతిలో మరో ముందడుగు పడింది. రాజధాని పరిధిలో నివాస సముదాయాల ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ చేపట్టేందుకు అనుమతి లభించింది. 930 కోట్ల రూపాయలతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సవరించిన అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. మరోవైపు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు అదనపు వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది.
మరోవైపు అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును మళ్లీ చేపట్టాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ.. ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపరాదని స్పష్టం చేశారు. అదనపు భారాన్ని సీఆర్డీఏనే భరించాలని.. 2018లో ఫ్లాట్ల బుకింగ్ సందర్భంగా.. ఏవైతే ధరలు ఖరారు చేశారో వాటికే కొనుగోలుదారులకు అందించాలని ఇటీవల జరిగిన సీఆర్‌డీఏ 37వ అథారిటీ సమావేశంలో చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరోవైపు 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏను ఏర్పాటు చేసింది. ఈ సీఆర్‌డీఏ 1200 ఫ్లాట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి తలపెట్టింది. అప్పట్లో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 714 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. అనంతరం ఫ్లాట్ల కోసం బుకింగ్ ప్రారంభించగా.. కొన్ని గంటల్లోనే మొత్తం బుక్ అయ్యాయి.
అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక మూడు రాజధానులను నిర్మిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. అమరావతిలో నిర్మాణాలను పట్టించుకోలేదు. దీంతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఐదేళ్ల ఆలస్యం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.930 కోట్లకు పెరుగుతుందని.. అయినా పెరిగే భారాన్ని సీఆర్డీఏనే భరించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అదనపు వ్యయాన్ని భరించేందుకు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం కూడా తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలనామోదం తెలిపింది.మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో ఫ్లాట్ల ధర పెంచకుండా, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పూర్తిచేయాలంటే సీఆర్డీఏకి రూ.216 కోట్లు నష్టం వస్తుందని అధికారుల అంచనా.