మాజీ మంత్రి, వైసీపీ ముఖ్యనేత ఆదిమూలపు సురేష్ ఇంటి నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని చెన్నకేశవ నగర్‌లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అయితే నిర్మాణ పనుల్లో బుధవారం ప్రమాదం జరిగింది. పనులు చేస్తున్న సమయంలో ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో వారిద్దరూ అక్కడే పడిపోయారు. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారిద్దరూ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు ప్రకాశం జిల్లా కంభంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. కరెంట్ షాక్ తగిలి ఓ మేస్త్రీ ప్రాణాలు కోల్పోయాడు. కంభంలోని శీలంవారి వీధిలో ఉండే దూదేకుల ఖలీల్ అనే వ్యక్తి టైల్స్ మేస్త్రీగా పనిచేస్తున్నారు. శీలంవారి వీధిలో అద్దెకు ఉంటున్నాడు. అయితే మంగళవారం తన ఇంటి యజమానికి చెందిన రేకుల షెడ్డుపైకి ఎక్కి పైపును కట్ చేస్తున్న సమయంలో ఖలీల్‌కు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు వినాయకచవితి నిమజ్జనానికి టపాసులు తీసుకునివస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు చనిపోయిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. టి. అగ్రహారంలోని ఎస్సీ కాలనీలో వినాయకచవితిని పురస్కరించుకుని వినాయకుడు విగ్రహం ఏర్పాటుచేశారు. అయితే ఈ గణేశుడి నిమజ్జనం కేసం బాణాసంచా తీసుకురావడానికి స్థానికంగా ఉండే తరుణ్, ప్రమోద్ అనే యువకులు బైక్ మీద ఒంగోలు వెళ్లారు. టపాసులు తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో మద్దిరాలపాడులోని 216 జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో తరుణ్‌కు తీవ్ర గాయాలు కాగా.. ఒంగోలు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రమోద్‌కు సైతం గాయపడి చికిత్స పొందుతున్నారు.