సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ రోజు(గురువారం) తుది శ్వాస విడిచారు. ఆగస్టు 19వ తేదీన శ్వాసకోశ సమస్యలతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే సీతారాం ఏచూరి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులల్లో ఒకరని తెలిపారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏచూరి ఎదిగారని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆయన ఆలోచనలు సీపీఎం పార్టీకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయని అన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులు, సహచరులు, అనుచరులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని చెప్పారు. ‘ప్రజా ఉద్యమాలకే జీవితం అంకితం చేసిన వారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నా. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి’ అని నారా లోకేష్ నినాదాలు చేశారు.