విజయనగరం జిల్లా, రామభద్రాపురంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఎస్కార్టు వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురుతోపాటు ముగ్గురు గన్‌మెన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.మంత్రి సంధ్యారాణి గురువారం విజయనగరం జిల్లా, రామభద్రాపురం, మెంటాడ మండలంలోని అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. ఈ క్రమంలో రామభద్రాపురం దాటిన తర్వాత ఆరికతోట సమీపంలో మంత్రి ఎస్కార్ట్ వాహనం ఫ్రంట్ టైర్ పేలిపోయింది. ఈ దశలో ముందు వెళుతున్న వ్యాన్‌ను ఎస్కార్టు వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గన్‌మెన్‌లు, వ్యాన్‌లో ఉన్నవారు గాయపడ్డారు. ఇద్దరు గన్‌మెన్‌ల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయనగంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనలో మంత్రి సంధ్యారాణికి తృటిలో ప్రమాదం తప్పింది. అయితే మంత్రి సంధ్యారాణి ఎస్కార్టు వాహనం వెనుక మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ఉంది. ముందు ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురికావడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని పక్కకు మళ్లించారు. దీంతో మంత్రికి ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు జాతీయ రహదారిపై రాకపోకలు తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా రోడ్ ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్కార్ట్ పోలీసులను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు.