గూగుల్, విప్రో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో జాబ్ కోసం లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అనుభవం ఉన్న వారితోపాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలోనూ పెద్ద పెద్ద కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాయి. ఇక తాజాగా ఓ యువతికి ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో గూగుల్ జాబ్ ఇచ్చింది. అయితే ఆమె ఏ ఐఐటీనో, ఎన్ఐటీలోనో చదువుకోలేదు. ఓ సాధారణ కాలేజీలో బీటెక్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత 2, 3 కంపెనీల్లో పనిచేసిన ఆ యువతి.. గూగుల్‌కు సెలెక్ట్ అయింది. తనకు రూ.60 లక్షల ప్యాకేజీని గూగుల్ ఆఫర్ చేసిందని.. స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.
బీహార్‌కు చెందిన అలంక్రిత సాక్షి అనే యువతికి తాజాగా గూగుల్‌లో ఉద్యోగం లభించింది. గతంలో ఆమెకు ఎర్నెస్ట్ అండ్ యంగ్, విప్రో, సామ్‌సంగ్ వంటి కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలోనే ఆమె గూగుల్‌లో అప్లై చేసుకోగా.. ఏకంగా సంవత్సరానికి రూ.60 లక్షల ప్యాకేజీ వరించింది. గూగుల్‌లో సెక్యూరిటీ అనలిస్ట్‌గా తనకు ఉద్యోగం వచ్చిందని అలంక్రిత సాక్షి.. లింక్డ్ ఇన్‌లో ఒక పోస్ట్ పెట్టింది. తనకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని.. ఒక మంచి డైనమిక్ టీమ్‌తో పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. తనకు ఈ జర్నీలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా అలంక్రిత సాక్షి ధన్యవాదాలు చెప్పింది. తన కొత్త ప్రయాణం ఇప్పుడు మొదలుకాబోతుందని ఆమె వెల్లడించింది.
అలంక్రిత సాక్షి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చూస్తే.. జార్ఖండ్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఆమె గతంలో విప్రోలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా ఆ తర్వాత ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో సెక్యూరిటీ అనలిస్ట్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇక ఆమె తాజాగా గూగుల్‌లో ఉద్యోగం వచ్చిందంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. చాలా మందికి ఆమె స్ఫూర్తి అంటూ కొనియాడుతున్నారు. ఆమె ఐఐఎం, ఐఐటీ, ఐఐఎంలలో చదువుకోకున్నా గూగుల్ లాంటి కంపెనీల్లో భారీ జీతంతో ఉద్యోగం రావడం షాకింగ్‌గా ఉందని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.