ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్

international |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 10:40 PM

10 రోజుల అంతరిక్ష యాత్ర కోసం.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్-ఐఎస్ఎస్‌కు వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయారు. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్‌మోర్.. ఈ ఏడాది జూన్ 5వ తేదీన అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వారిని తీసుకువచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అంతరిక్షంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎర్త్ టు స్పేస్ కాల్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దీనికోసం ఐఎస్ఎస్‌లో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.


ఈ స్పేస్ కాల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్.. తమ అనుభవాలను పంచుకున్నారు. బోయింగ్‌ స్టార్‌లైనర్ తమను విడిచిపెట్టి వెళ్లడం కఠినంగా అనిపిస్తోందని సునీతా విలియమ్స్ తెలిపారు. ఈ కారణంగా మరికొన్ని నెలలు తాము స్పేస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు. అయినా అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉందని.. ఇది కూడా తమ విధుల్లో భాగమే అని భావిస్తున్నట్లు చెప్పారు. తనకు ఇది హ్యాపీ ప్లేస్‌ అని.. అక్కడ ఉండేందుకు సర్దుబాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులను బాగా మిస్‌ అవుతున్నట్లు తెలిపారు. ఇక స్పేస్‌లో ఉండటం ఎలాంటి ఇబ్బందికి గురిచేయడం లేదని బుచ్ విల్‌మోర్ తెలిపారు.


ఇక సునీతా విలియమ్స్‌, బుచ్ విల్‌మోర్ స్పేస్ నుంచే.. నవంబర్ 5వ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అమెరికా ఎన్నికలపై స్పందించారు. బ్యాలెట్‌ కోసం తమ విజ్ఞప్తిని నాసాకు పంపించామని.. అమెరికా పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు. తమ ఓటు హక్కును నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుందని బుచ్ విల్‌మోర్‌ వెల్లడించారు. ఓటు మా బాధ్యత.. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నాను అంటూ సునీతా విలియమ్స్ ఆనందం వ్యక్తం చేశారు.


అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించడం అనేది 1977 నుంచి ప్రారంభం అయింది. దీనికోసం ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్లను నాసా వినియోగిస్తోంది. ఈ ప్రక్రియ కాస్త కష్టమే అయినప్పటికీ చేస్తూనే ఉన్నారు. ముందుగా ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ పరికరాలతో ఐఎస్ఎస్‌కు పంపిస్తారు. అక్కడ ఉన్న వ్యోమగాములు వాటిలో వివరాలను రాసి తిరిగి భూమిపైకి పంపిస్తారు. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఎన్‌క్రిప్షన్‌ పద్ధతిలో బ్యాలెట్లను హ్యూస్టన్‌లోని నాసా మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి వాటిని ఆయా రాష్ట్రాల్లోని కౌంటీ క్లర్క్‌లకు పంపించి ప్రక్రియను జరిపిస్తారు.


నాసా చేపట్టిన 10 రోజుల మిషన్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో జూన్‌ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ చేరుకున్నారు. అయితే జూన్ 14వ తేదీన వీరిద్దరూ తిరిగి భూమికి పయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే బోయింగ్ సంస్థ ఈ సమస్యను పరిష్కరించినా.. వారిని అందులో తీసుకురావడం సురక్షితం కాదని నాసా తేల్చింది. దీంతో న్యూ మెక్సికోలోని వైట్‌ శాండ్స్‌ స్పేస్‌ హార్బర్‌లో స్టార్‌లైనర్‌ వ్యోమనౌక సురక్షితంగా కిందకు దిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com