బుడమేరుకు విజయవాడ దుఖఃదాయని అని పేరు. ఇటీవల ఈ వాగు పగ..మేరుగా మారి విజయవాడను వణికించిన తీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రంలో ‘ఆపరేషన్ బుడమేరు’కు అడుగులు పడుతున్నాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించడంతోపాటు ఈ వాగు గట్లను బలోపేతం చేయడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడటంతో వరద నీరు విజయవాడను ముంచెత్తి బీభత్సం సృష్టించింది. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు అండగా ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి అధికారుల వరకు పదిరోజుల పాటు నిలబడటం, ఆర్మీ సహకారంతో గండ్లు పూడ్చివేయడం..వరద నష్టాలను చాలా వరకు తగ్గించింది. ఈ నేపథ్యంలో బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారంగా ‘ఆపరేషన్ బుడమేరు’ను రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా వాగు పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణల తొలగించనున్నారు. వాటిని ఆక్రమించినవారినీ, తెలియక ఆ ప్రాంతంలో స్థలాలు కొన్నవారిని పిలిపించి మాట్లాడి సామరస్యంగా ఈ సమస్యకు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో బుడమేరు గట్ల వెంట ఇష్టారాజ్యంగా ఇసుకను, మట్టిని తోడి అమ్ముకున్న నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా భావిస్తోంది. ఇక.. పటిష్ఠ చర్యల్లో భాగంగా ఈ వాగు ప్రవాహం సాఫీగా సాగేందుకు ఎక్కడికక్కడ కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు. బుడమేరు గండ్ల పటిష్ఠతకు అన్ని చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. విజయవంతంగా గండ్లను పూడ్చివేయడంతోపాటు, అక్కడ గట్టు ఎత్తును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఒకదశ వరకు ఆర్మీ సహకారం కలిసివచ్చినా.. చివరిదాకా మంత్రులే గట్ల మీదే నిలబడి గండ్ల పని పూర్తిచేశారు. ఆ వెంటనే ఎత్తును కూడా పెంచారు. అయినా... బుడమేరు వరదను శాశ్వతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు.. జలవనరుల శాఖను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. బుడమేరుకు వచ్చే వరద నీరు 15 వేల క్యూసెక్కులుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అసాధారణ రీతిలో భారీ వర్షాలు పడటంతో ఈసారి మాత్రమే బుడమేరకు రికార్డుస్థాయిలో 45 వేల క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో బుడమేరుకు దాదాపు 37వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునేలా విస్తరణ పనులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం డీపీఆర్ రూపొందించాలని నిర్దేశించారు. బుడమేరులో బలహీనంగా ఉన్న గట్లను ముందుగా గుర్తించాలన్నారు. వాగుకు గండ్లు పడిన చోట రిటైనింగ్ వాల్‌ను నిర్మించాలని ఆదేశించారు.